Wednesday, April 27, 2011

మీ ప్రియ పాఠకుడు ...!: నా చిన్ననాటి జ్ఞాపకాలు


కృష్ణా జిల్లా, కైకలూరు మండలం లోని రాచపట్నం గ్రామం నా స్వగ్రామం . ఎందుకో కారణం చెప్పలేను కాని నాకు ఊహ తెలిసి జిల్లాల పేర్లు తెలుసుకుంటున్నప్పుడు నాకు ఆంధ్ర ప్రదేశ్ లోని మిగిలిన జిల్లాల పేర్లన్నింటికన్నా కృష్ణా జిల్లా అన్న పేరు చాలా నచ్చేది. మా గ్రామం చాలా అందమైనది అని చెప్పలేను కాని చాలా మంచి ఊరని గర్వంగా చెప్పగలను. మా ఊరి మీదుగా మూడు కాలువలు వర్షా కాలం నుండి వేసవి వచ్చే వరకూ నీటితో కళ కళ లాడుతుండేవి. మా ఊరిలో రెండు ప్రాధమిక పాఠశాలలుండేవి. ఒకటి గవర్నమెంట్ స్కూల్ రెండవది మిషనరీ స్కూల్, మీకు అర్ధమైవుంటుంది .మా ప్రాధమిక విద్య మిషనరీ స్కూల్లోనే సాగి వుంటుంది. సి.బి.సి.ఎన్.సీ స్కూల్ అనే మా 'బడి' మా యింటి సరిహద్దును ఆనుకునే వుండేది. యిప్పటికీ క్రైస్తవం అన్నా , జీసస్ అన్నా నాకు గురివుండటానికి కారణం నేను మిషనరీ స్కూల్ లో చదివుకోవటమే, ఆల్రెడీ క్రిష్టియన్ అయ్యుండి "యిప్పటికీ" అనాల్సి రావటం గురించి " నేను-నా మత విశ్వాసం" టాపిక్ లో వివరిస్తాను. మిగిలిన ఏ విషయాల్లోనూ పక్షపాతం గా కనబడని నా ఊరు స్కూల్ విషయం వచ్చేసరికి ఎందుకలా ? అని నా చిన్న మెదడు (అంటే నా చిన్నప్పటి మెదడని అర్ధం) ప్రశ్నిస్తూండేది.
సామాజికంగా , ఆర్ధికంగా ముందున్న సామాజిక వర్గాల పిల్లలకు అందుబాటులో వుండేది ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల , బహుశా ఆ తెల్ల దొరల సహాయ సహకారం లేకుండుంటే అనగా ఆ మిషనరీ స్కూల్ లేకుంటే నేనూ నా తోటి మా పల్లె లోని దళిత, దళిత క్రైస్తవ పిల్లలమంతా నిరక్ష్యరాసులుగా మిగిలిపోయుండే వాళ్ళమే కదా ?
దళితులకు వెనుక బడిన వర్గాల విద్య, వైద్య అవసరాలకు ప్రభుత్వాలు రాజీలేని ఖర్చు , పెడుతున్నట్లుగా ప్రభుత్వాలు ఊకదంపుడుగా ప్రకటించుకుంటుంటాయి. కానీ వాస్తవంలో యిదిగో నిజాలు యిట్లా వుంటాయి. యిదొక్క విషయములో తప్ప మిగిలిన అన్ని విషయాలు సాధరణంగానే అనిపించేవి. ప్రధానంగా యాదవ , దళిత జనాభా ఎక్కువ గాను తరువాత గౌడ, చౌదరి సామాజిక వర్గాలు వుండేవి. మా ఊరిలో ఉన్నత సామాజిక వర్గమైన చౌదరీస్ చాలా మంచివారు . ఏ ఒక్క వర్గాన్ని బాదించలేదు. కాకపోతే సహజంగానే మాదే పై చేయిగా వుండాలన్నట్లు కొన్నిసార్లు బింకానికి పోయినా మిగిలిన వర్గాలు తెగే వరకూ లాగకుండా సామరస్య వాతావరణంలో ఆ విషయాలను అంతటితో ముగించేసేవారు. పొలాల నిండుగా కొబ్బరి, తాటి చెట్లు , కొన్ని పొలాలలో మామిడి చెట్లు విరివిగా వుండేవి. నా ప్రాధమిక విద్య మిషనరీ స్కూల్ లోనూ , ఆరవ, ఏడవ తరగతులు ఆకివీడు పట్టణం లోనూ జరిగాయి.

2 comments:

  1. యోహాన్ గారూ....

    ''మా ఊరిలో ఉన్నత సామాజిక వర్గమైన చౌదరీస్ చాలా మంచివారు . ఏ ఒక్క వర్గాన్ని బాదించలేదు. కాకపోతే సహజంగానే మాదే పై చేయిగా వుండాలన్నట్లు కొన్నిసార్లు బింకానికి పోయినా మిగిలిన వర్గాలు తెగే వరకూ లాగకుండా సామరస్య వాతావరణంలో ఆ విషయాలను అంతటితో ముగించేసేవారు''

    అన్నారు మీరు. యజమాని మంచివాడైనంత మాత్రాన బానిసకి ఏం ఒరుగుతుందో....మీ వూరి కమ్మ వారు మంచి వారైనంత మాత్రానా మీ వూరి దళితులకీ అంతే ఒరుగుతుంది.సమస్య వ్యక్తుల్లో లేదు...వ్యవస్థ లో ఉంది...మూలాలలోకి వెళ్ళండి...
    మీ పోస్ట్స్ లో షార్ప్ నెస్ కనిపిస్తోంది...స్టడీ చేస్తూనే రాయండి.ఆల్ ది బెస్ట్.

    మల్లీశ్వరి
    jajimalli.wordpress.com

    ReplyDelete
  2. మీ చిన్ననాటి జ్నాపకాలు బాగున్నాయి.. మీరు మతపరమైన నమ్మకాలపై పోస్ట్ రాస్తానన్నారు..వేచి చూస్తున్నాను.. బ్లాగ్ ద్వారా ఇలా మరిన్ని విషయాలు పంచుకొనగలరని ఆశిస్తూ...

    ReplyDelete